మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం

  • ‘ఉప-కోటా ’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా
  • ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్
  • మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై (నారీ శక్తి వందన్ అధినియం) పార్లమెంటులో వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలన్న డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

ఈ చర్చలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మహిళలకు కేటాయించిన 33శాతం రిజర్వేషన్లలో వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా ఉప-కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అఖిలేశ్ డిమాండ్‌పై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నాయని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని ప్రభుత్వం తరఫున ఆయన గట్టిగా వాదించారు.

ఈ బిల్లును వెంటనే అమలు చేయకుండా జనాభా గణన (సెన్సస్), నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమలు చేస్తామని చెప్పడంపైనా విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం కాగా, ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడమే ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

Amit Shah
Women Reservation Bill
Akhilesh Yadav
Nari Shakti Vandan Adhiniyam
OBC Reservation
Muslim Women Reservation
Indian Parliament
कोटा Reservation Quota
Census India
Political Debate

More Telugu News